పుట్టపర్తి : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో నిర్వహించిన 8వ సీనియర్ స్టేట్ లెవల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బేస్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. రామ్–లక్ష్మణ్ గ్రౌండ్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో రాష్ట్రంలోని 44 జట్లు పాల్గొన్నాయి. జట్లు అధిక సంఖ్యలో హాజరు కావడంతో పోటీలను ఒక రోజు పొడిగించారు.
లీగ్, క్వార్టర్ ఫైనల్, నాకౌట్ మ్యాచ్‌లను నిర్ణీత ప్రణాళిక ప్రకారం నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను అభినందించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు.
విజేతలు వీరే..
పురుషుల విభాగంలో నంద్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. శ్రీకాకుళం ద్వితీయ, విజయనగరం తృతీయ స్థానాలను సాధించాయి. మహిళల విభాగంలో శ్రీకాకుళం ప్రథమ, నెల్లూరు ద్వితీయ, పల్నాడు తృతీయ స్థానాల్లో నిలిచాయి.
3 శాతం క్రీడా కోటాపై హర్షం
క్రీడాకారులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేలా క్రీడా కోటా కింద 3 శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బేస్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ నుంచి అనుమతులు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కిషోర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సమకోటి ఆదినారాయణ, డాక్టర్ తిరుపతి ఇంద్ర, లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, రామ్ లక్ష్మణ్, బోయ రామాంజనేయులు, రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, సీఈవో మాధవరావు, జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, వైస్ ప్రెసిడెంట్ రామచంద్రనాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.