ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్
కదిరి, (అమరావతి వెలుగు): బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు శుక్రవారం కదిరి పట్టణంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ వద్ద బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకుల వారీగా సాధించిన ఫలితాల ఆధారంగా ఉద్యోగులందరికీ ఇన్సెంటివ్‌లు అందించాలని, ఉద్యోగులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూఎఫ్‌బీయూ, బ్యాంకు మేనేజ్‌మెంట్ల మధ్య కుదిరిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదం తెలపకపోవడం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు కట్టబెట్టి, నామమాత్రపు వసూళ్లతో రుణాలను మాఫీ చేస్తోందని విమర్శించారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులు చేపట్టే సమ్మెలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు జి.విష్ణువర్ధన్‌రెడ్డి (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఓబులరెడ్డి (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్), గోపీనాథ్ (ఎస్‌బీఐ), సీఐటీయూ నాయకులు బాబ్జాన్, సాంబశివ, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు.