– 16వ జాతీయ వినియోగదారుల సదస్సులో శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
పుట్టపర్తి, సెప్టెంబర్ 12:
వస్తువుల ప్రత్యక్ష కొనుగోలు నుంచి ఆన్‌లైన్ సేవల వరకు వినియోగదారులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని, వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ అన్నారు.
పుట్టపర్తిలోని సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాల్‌లో 16వ జాతీయ వినియోగదారుల అవగాహన సదస్సు, మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ (CAPCO), కన్స్యూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ (CCC), న్యూఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినియోగదారులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి “ఒకే సంస్థ – ఒకే గళం” అనే భావనతో విధానపరమైన నిర్ణయాల్లో వినియోగదారుల హక్కులను బలంగా వినిపించాలనే లక్ష్యంతో 1990లో CCC ఆవిర్భవించడం వినియోగదారుల ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై మరింత అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
సభాధ్యక్షులు, CAPCO/CCC చైర్మన్ శ్రీ జి. సురేష్ కుమార్ మాట్లాడుతూ, వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకుని “ప్రశ్నించే తత్వాన్ని” అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
శ్రీ సత్యసాయి నడయాడిన పవిత్ర పుట్టపర్తి నేలపై జాతీయ స్థాయిలో వినియోగదారుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సదస్సుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సదస్సులో CCC జాతీయ చైర్మన్ శ్రీ అభిషేక్ శ్రీవాస్తవ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి ప్రేమ సంజని పట్నాల, ప్రొఫెసర్ అనిల్ జవహరి, CAPCO గౌరవ చైర్మన్ శ్రీ నాగేశ్వరరావు, CCC వ్యవస్థాపకులు శ్రీ ఎం. కృష్ణారెడ్డి, మాజీ చైర్మన్ శ్రీ షాజీ, హైకోర్టు అడ్వకేట్ శ్రీ సునీల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
CCC 35 ఏళ్ల ప్రస్థానం
CCC ఆవిర్భవించి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అతిథులు ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో డిజిటల్ విధానాలు, ఆన్‌లైన్ న్యాయ ప్రక్రియలు కీలకంగా మారుతున్నాయని వక్తలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల చైతన్యం, MRP అమలు, ఆహార భద్రత, సురక్షిత డిజిటల్ లావాదేవీలపై గత 15 సంవత్సరాలుగా CAPCO అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తోందని తెలిపారు.
కొత్త సాంకేతిక సవాళ్లపై చర్చ
ప్రస్తుత ఆధునిక కాలంలో వినియోగదారులు కేవలం ధర, నాణ్యత సమస్యలకే పరిమితం కాకుండా ఈ-కామర్స్, ఆన్‌లైన్ మోసాలు, తప్పుడు ప్రకటనలు, డేటా రక్షణ, కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి అనేక కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారని CCC ప్రతినిధులు తెలిపారు.
రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సులో ప్రధానంగా:
- డిజిటల్, ఆర్థిక రంగాల్లో వినియోగదారుల అవగాహన పెంపు
- ఆహార, ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం
- యువతను వినియోగదారుల ఉద్యమంలో భాగస్వాములను చేయడం
- ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత సులభతరం చేయడం
- భవిష్యత్ జాతీయ వినియోగదారుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం
వంటి అంశాలపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
“సమస్యలపై వ్యక్తిగతంగా పోరాడటం కంటే… ఉమ్మడి కార్యాచరణతోనే వినియోగదారుల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుంది” అనే సందేశంతో జాతీయ స్థాయిలో వినియోగదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని సదస్సు పిలుపునిచ్చింది.
మధ్యాహ్నం నిర్వహించిన ప్రత్యేక వినియోగదారుల అవగాహన కార్యక్రమంలో CCC ప్రతినిధులు రామ్ అవతార్, అమృత్ లాల్ షాహా, భైక లక్ష్మి, పవన్ గోయల్, నాగార్జున, విజయలక్ష్మి, మిశ్రా తదితరులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పది రాష్ట్రాల నుంచి CCC ప్రతినిధులు హాజరై జాతీయ స్థాయిలో వినియోగదారుల ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.