Amaravathi Flash
Date of Publish : 02/11/2026, 5:59 am
Published by J.V. Ramesh Babu

మహిళలు, బాలికలపై దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం

మహిళలు, బాలికలపై దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం.                  రాప్తాడులో బాలికపై దాడి ఘటనను ఖండించిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశాయి భారతి రెడ్డి

ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) నవంబర్ 1

కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు, బాలికలపై దాడులు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశాయి భారతి రెడ్డి విమర్శించారు. రాప్తాడులో పదో తరగతి చదువుతున్న బాలికపై జరిగిన దాడి ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు.

ఆదివారం నంబులపూలకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేశాయి భారతి రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూస్తామని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రకటించారని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందని, మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో మహిళల భద్రతపై గొప్పగా మాట్లాడిన కూటమి నాయకులు, ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

అధికారంలో ఉన్నప్పటికీ మహిళలు, బాలికలకు రక్షణ కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాప్తాడు ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం తక్షణమే సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు అనురాధమ్మ, అనూష తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save