ఎన్ పి కుంట. (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 20 : స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, దివ్యాంగులను, వికలాంగులను,పాలిచ్చే తల్లులకు మినహాయింపు ఇవ్వాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు గజ్జల హరిప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజులు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న మున్సిపల్/ కార్పొరేషన్ ఎన్నికల విధుల కోసం జిల్లా వ్యాప్తంగా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, వికలాంగులను, చంటి పిల్లల తల్లులను, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులను నియమించారని తెలిపారు. ఎంతో మానసిక ఒత్తిడితో కూడుకున్న ఎన్నికల వీధుల్లో వికలాంగులను, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, దివ్యాంగులను , వయసు మీరి పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిని వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంధులకు ఎన్నికల విధులనుండి మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా ఎన్నికల విధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల విధులు కేటాయించబడి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, వికలాంగులను, చంటి పిల్లల తల్లులను, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయుల నుండి వినతులు స్వీకరించేందుకు జిల్లా కేంద్రంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారి నుండి వినతులను స్వీకరించి వారిని ఎన్నికల విధులు నుండి మినహాయించాలని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా వచ్చే నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజు OD సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.