Amaravathi Flash
Date of Publish : 21/10/2026, 3:13 pm
Published by J.V. Ramesh Babu

రైలులో ప్రయాణిస్తూ స్పీకర్‌లో పాటలు, వీడియోలు ప్లే చేస్తున్నారా? ఇలాచేస్తే మీరు జైలుకే..

రైలులో తరచూ ప్రయాణం చేస్తుంటారా? ప్రయాణంలో ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం, స్పీకర్‌లో పాటలు వినడం, వీడియోలు చూడటం అలవాటుగా ఉందా? అయితే జాగ్రత్త! తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి చర్యలపై దక్షిణ రైల్వే (Southern Railway) కీలక హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.1,000 వరకు జరిమానాతో పాటు, కొన్ని పరిస్థితుల్లో ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రైళ్లలో, రైల్వే ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్లలో బిగ్గరగా మాట్లాడటం, స్పీకర్ మోడ్‌లో పాటలు వినడం లేదంటే వీడియోలు ప్లే చేయడం వల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని దక్షిణ రైల్వే పేర్కొంది. ఇక నుంచి ఇలా చేస్తే.. రైల్వే చట్టంలోని సెక్షన్ 145 ప్రకారం.. ఇలాంటి చర్యలు ఇబ్బందికర ప్రవర్తనగా పరిగణించే సందర్భాల్లో జరిమానా విధించవచ్చు. సంబంధిత నిబంధనల ప్రకారం రూ.1,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అధికారుల హెచ్చరిక తర్వాత కూడా అదే ప్రవర్తన కొనసాగిస్తే, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదంటే మరింత జరిమానా విధించనున్నారు. ఈ విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని తన పరిధిలోని డివిజన్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదేశించారు.

ప్రయాణికులు మొబైల్ ఫోన్లను సైలెంట్ లో, వైబ్రేషన్ మోడ్‌లో ఉంచాలని, ఫోన్‌లో మాట్లాడేటప్పుడు తక్కువ శబ్దంతో మాట్లాడాలని రైల్వే అధికారులు సూచించారు. పాటలు వినడానికి, వీడియోలు చూడడానికి స్పీకర్లకు బదులుగా ఇయర్‌ఫోన్లు ఉపయోగించాలని సూచించారు. ఈ నిబంధనలపై ప్రాంతీయ భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లోనూ ప్రకటనలు జారీ చేయాలని, రైల్వే ప్రాంగణాల్లో నోటీసులు ఏర్పాటు చేయాలని దక్షిణ రైల్వే తన డివిజన్లకు సూచించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save