
ఈ కార్యక్రమానికి డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ, కార్యదర్శి అశోక్ శర్మ, ఉపాధ్యక్షురాలు శిఖా కుమార్, కోశాధికారి హరీష్ సింగ్లా, సంయుక్త కార్యదర్శి అమిత్ గ్రోవర్ హాజరయ్యారు. డీడీసీఏ లీగ్ 40 ఓవర్ల టోర్నమెంట్, పురుషుల టీ20 లీగ్, హాట్ వెదర్ టోర్నమెంట్లలో విజేతలు, రన్నరప్‌లతో పాటు వ్యక్తిగతంగా విశేష ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో డీడీసీఏ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల టీ20 లీగ్‌కు తొలిసారిగా ప్రైజ్‌మనీని ప్రవేశపెట్టింది. ఈ లీగ్‌లోని 10 గ్రూపుల్లో విజేతలకు రూ. 2 లక్షలు, రన్నరప్‌లకు రూ. 1.75 లక్షల చొప్పున బహుమతులను అందజేశారు. మహిళా క్రికెట్‌కు తగిన గుర్తింపునివ్వడంతో పాటు, వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యక్షురాలు శిఖా కుమార్ తెలిపారు.
ఢిల్లీ క్రికెట్‌ను అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడానికే ఇటువంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ వెల్లడించారు. ఈ నగదు బహుమతులు యువ క్రికెటర్లలో కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపి, వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా తోడ్పడతాయని కార్యదర్శి అశోక్ శర్మ పేర్కొన్నారు.