నిజాయితీ చాటుకున్న కదిరి రూరల్ పోలీసులు

రూ.8,600 నగదు, ఆధార్ కార్డు, విలువైన కార్డులతో పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత

కదిరి, సెప్టెంబర్ 13: నిజాయితీ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణకు నిదర్శనంగా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోంగార్డు గంగిరెడ్డి వ్యవహరించారు.

కదిరి టౌన్ రెవెన్యూ కాలనీకి చెందిన జై శ్రీరాములు, తండ్రి పెద్ద పుల్లప్ప బజారు నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో తన పర్సును పోగొట్టుకున్నారు. ఆ పర్సులో రూ.8,600 నగదు, ఆధార్ కార్డు మరియు ఇతర విలువైన కార్డులు ఉన్నాయి.

ఈ క్రమంలో డ్యూటీ ముగించుకుని పోలీస్ స్టేషన్‌కు వస్తున్న కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ హోంగార్డు గంగిరెడ్డికి రోడ్డుపై పర్సు కనిపించింది. పర్సులో ఉన్న ఆధార్ కార్డును పరిశీలించి, వెంటనే విషయాన్ని కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు.

ఇన్‌స్పెక్టర్ గారు ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా పర్సు యజమాని జై శ్రీరాములును గుర్తించి, ఆయనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం పర్సును అందులోని రూ.8,600 నగదు, ఆధార్ కార్డు మరియు ఇతర విలువైన కార్డులతో సహా సురక్షితంగా ఆయనకు అప్పగించారు.

పోగొట్టుకున్న తన పర్సును ఎటువంటి లోటుపాట్లు లేకుండా తిరిగి అందజేసిన పోలీసులకు జై శ్రీరాములు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కదిరి డీఎస్పీ శ్రీ శివ నారాయణ స్వామి గారు మరియు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నిరంజన్ రెడ్డి గారు హోంగార్డు గంగిరెడ్డి నిజాయితీ, నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజల ఆస్తి పట్ల బాధ్యత, నిజాయితీతో వ్యవహరించడం పోలీసు శాఖలో ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సిబ్బందిని ప్రోత్సహిస్తామని అధికారులు తెలిపారు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :